కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీచిన కాంగ్రెస్ వేవ్ లో అధికార బీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఓటమిపాలయ్యారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాలకు గాను 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మంత్రి విరసనోల్ల శ్రీనివాస్ గౌడ్ తో సహా దేవరకద్రలో ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జడ్చర్లలో డాక్టర్ సి.లక్ష్మారెడ్డిలు ఓటమిపాలయ్యారు. మొదటి రౌండ్ నుంచి ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో చివరకు కాంగ్రెస్ అభ్యర్థులను విజయం వరించింది. హైదరాబాద్ నగరానికి సమాంతరంగా అభివృద్ధి చేస్తున్న నన్ను ప్రజలు ఆదరించి, అక్కున చేర్చుకుని మూడో సారి మళ్లీ గెలిపిస్తారని ధీమాలో ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ప్రజలు ఇంటి బాట పట్టించారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో శ్రీనివాస్ గౌడ్ కు 67,736 ఓట్లు రాగా, ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి యేన్నం శ్రీనివాస్ రెడ్డికి 84,728 ఓట్లు పోలయ్యాయి. శ్రీనివాస్ గౌడ్ పై యేన్నం శ్రీనివాస్ రెడ్డి 16,992 మెజార్టీతో గెలుపొందారు. దేవరకద్ర నియోజకవర్గం లో సౌమ్యుడుగా పేరున్న ఆల వెంకటేశ్వర్ రెడ్డి కూడా ఓటమిపాలయ్యారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గవినోళ్ల మధుసూదన్ రెడ్డి 907 ఓట్లతో విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డికి 87,002 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి గవినోళ్ళ మధుసూదన్ రెడ్డికి 87,909 ఓట్లు పోలయ్యాయి. జడ్చర్ల నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జనంపల్లి అనిరుద్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. జనంపల్లి అనిరుద్ రెడ్డి కి 90,145 ఓట్లు పోలవగా, ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ లక్ష్మారెడ్డికి 75,515 ఓట్లు పోలయ్యాయి. జనంపల్లి అనిరుద్ రెడ్డి లక్ష్మారెడ్డి పై 14,630 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మహబూబ్ నగర్ నియోజక వర్గం నుంచి గెలుపొందిన యేన్నం శ్రీనివాస్ రెడ్డి గతంలో రెండున్నర ఏళ్ళు బిజెపి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేలుగా గెలిచిన మధుసూదన్ రెడ్డి అనిరుద్ రెడ్డిలకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు వీరిద్దరూ కొత్తగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు.
Admin
Kalam Power News