కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : రేషన్ డీలర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా అవుతున్న దొడ్డు బియ్యం నాణ్యత లేని కారణంగా ప్రజలు తీసుకువెళ్తలేరన్న కారణాన్ని చూపిస్తూ రేషన్ డీలర్లు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై చేతివాటం చూపిస్తున్నారు. ప్రతినెల తేల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సివిల్ సప్లై ద్వారా బియ్యం సరఫరా చేస్తున్నారు. సంబంధిత కోటా ప్రకారం రేషన్ షాప్ లకు బియ్యం సరఫరా జరుగుతుంది. కానీ ఇక్కడే అసలైన తతంగం కొనసాగుతోంది. అధికారుల అండదండలతో రేషన్ డీలర్లు చెల్లరేగిపోతున్నారు. తమకు రావాల్సిన స్టాకును ఆయా స్టాక్ పాయింట్ల వద్దనే ఉంచి పక్కదారి పట్టిస్తున్నారు. ఈతతంగం అంతా అధికారుల కనుసన్నంలోనే కొనసాగుతోంది. తెల్లరేషన్ కార్డ్ కలిగిన వెనుకబడిన తరగతి వారికి అందించాల్సిన రేషన్ బియ్యం ఇవ్వకుండా డబ్బులు మాత్రమే ఇస్తామని రేషన్ షాప్ యాజమానులు కొత్త ఎత్తుగడలతో నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంతో పాటు వివిధ గ్రామాల్లో పదో, పరకో, ఇచ్చి పేద వారి నోటికాడి కూడును లాగేసుకుంటున్నారు. సమయపాలన పాటించకుండా వారిష్టానుసారంగా వ్యవహరిస్తూ నెలలో రెండు, మూడు రోజులు మాత్రమే తెరిచి ఉంచి తూతూ మంత్రంగా కొందరికి మాత్రమే రేషన్ బియ్యాన్ని అందజేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్ కార్డు ఉంటే ఎక్కడైనా బియ్యం తీసుకోవచ్చనే నిబంధనను తుంగలో తొక్కుతూ వివిధ గ్రామాల, పట్టణాల నుండి బ్రతుకుతెరువు కోసం వచ్చిన కూలీలకు, రేషన్ షాప్ యజమానులు సిండికేట్ గా ఏర్పడి వారికి చుక్కలు చూపిస్తున్నారు. మా దగ్గర స్టాక్ లేదని మా కోట వరకే ఉన్నాయని వేరే షాపు దగ్గరికి వెళ్ళమని ఉచిత సలహాలు ఇస్తున్నారు. కాగా బియ్యం లేవని డబ్బులు ఇవ్వాలంటే ఇస్తామని 10 రూపాయల నుండి 12 రూపాయలు మాత్రమే అందిస్తూ రేషన్ డిలర్లు మాత్రం రూ 23 నుంచి 25 రూపాయల వరకు రీసైకిలింగ్ కు పాల్పడే రైస్ మిల్లర్లకు అమ్ముకొని పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. ఏ రేషన్ షాప్ కు వెళ్లి అడిగినా ఒకటే సమాధానం. ఓ గ్రామంలో అయితే రెండు రోజులలో రెండు గంటలు మాత్రమే షాపు తెరిచి స్టాక్ అయిపోయిందని చేతులు దులుపుకుంటున్నారు. రేషన్ బియ్యం తినలేమని, కోళ్ల ఫారం తీసుకెళ్లాల్సి వస్తుందని దళారులు తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. కానీ చాలామంది దోష, ఇడ్లీ, ఉప్మా, వివిధ ఫలహారాలకు దొడ్డు బియ్యాన్ని ఉపయోగిస్తున్నారు. బ్రతుకు తెరువు కోసం వచ్చిన వివిధ కూలి పనులు చేసుకుంటున్న బీహార్ కు చెందిన లేబర్ 50 రూపాయల వరకు వెచ్చించి బహిరంగ మార్కెట్లో కొనుక్కోలేక ఇవే బియ్యాన్ని 30నుంచి 35 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో 50 రూపాయలు పెట్టి కొనాల్సిన బియ్యం కొనలేక పోతున్నామని, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో నైనా రేషన్ షాప్ యజమానులపై కఠినంగా వ్యవహరించి సమయపాలన పాటించే విధంగా చర్యలు తీసుకొని, బియ్యానికి బదులు డబ్బులు ఇవ్వకుండా నాణ్యమైన బియ్యం పంపిణి చేయాలని తెల్ల రేషన్ కార్డ్ లబ్దిదారులు కోరుతున్నారు.
Admin
Kalam Power News