కలం పవర్ న్యూస్ - రాజకీయం / మహబూబ్ నగర్ : మహబూబ్‌నగర్, మార్చి 19 ( కలం పవర్ న్యూస్ బ్యూరో ) మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పోరేషన్‌లో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎవరు అనే ప్రశ్న ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల కొత్తగా కొలువుదీరిన కార్పోరేషన్‌లో ఈ పదవి నియామకంపై పార్టీ అంతర్గతంగా మల్లగుల్లాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పార్టీ లోపల వినిపిస్తున్న ప్రధాన అభ్యర్థుల పేర్లలో సీనియర్ నాయకుడు పాండురంగ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొత్తకోట కిరణ్ కుమార్ రెడ్డితో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన 21వ డివిజన్ కార్పొరేటర్ గుండ సంతోష్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే జిల్లాలో బీజేపీ నాయకత్వంపై 'క్రియాశీల పదవుల్లో' “ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యం” ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంపీ డీకే అరుణ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే కావడంతో కీలక పదవులు అదే వర్గానికి కట్టబెట్టారనే అపవాదు పార్టీపై ముద్ర వేసింది. ఈ నేపథ్యంలో ఫ్లోర్ లీడర్ ఎంపిక పార్టీకి కేవలం పదవి నియామకం కాకుండా, ఒక రాజకీయ సందేశంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో గుండ సంతోష్ పేరును ముందుకు తెచ్చే వర్గం బలపడుతోంది. గత 20 సంవత్సరాలుగా పార్టీ మారకుండా బీజేపీలోనే కొనసాగుతూ, కష్టకాలంలో కూడా పార్టీ కార్యకలాపాలను ముందుకు నడిపించిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా బీఆర్‌ఎస్ పాలనలో సవాళ్లను ఎదుర్కొంటూ, పార్టీకి స్థానిక స్థాయిలో బలమైన వాణిగా నిలిచిన అనుభవం ఆయనకు ప్లస్ పాయింట్‌గా మారింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, గుండ సంతోష్‌ను ఫ్లోర్ లీడర్‌గా ఎంపిక చేస్తే రెండు ప్రయోజనాలు సాధ్యమవుతాయి. ఒకవైపు బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుండగా, మరోవైపు “సామాజిక న్యాయం” పాటిస్తున్నామనే బలమైన సంకేతం ప్రజల్లోకి వెళ్తుంది. దీంతో ప్రతిపక్షాలు కుల ఆధారిత విమర్శలు చేయడానికి అవకాశాలు తగ్గుతాయని భావిస్తున్నారు. ఇక పార్టీ భవిష్యత్తు దృష్ట్యా కూడా ఈ నిర్ణయం కీలకంగా మారే అవకాశం ఉంది. కార్పోరేషన్ సమావేశాల్లో ప్రజల సమస్యలను బలంగా వినిపించే నాయకత్వం అవసరం ఉన్న నేపథ్యంలో, ఫీల్డ్ లెవల్‌లో పని చేసిన అనుభవం ఉన్న నాయకుడిని ఎంపిక చేయాలనే డిమాండ్ కూడా పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. అయితే సీనియారిటీ, అనుభవం అనే అంశాలను ముందుకు తెచ్చే వర్గం కూడా పార్టీ లోపల బలంగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం ఎలాంటి సమీకరణాలు చూసి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద చూస్తే, మహబూబ్‌నగర్ కార్పోరేషన్‌లో ఫ్లోర్ లీడర్ ఎంపిక కేవలం ఒక పదవి కేటాయింపుగా కాకుండా, పార్టీ భవిష్యత్తు దిశను నిర్ణయించే రాజకీయ నిర్ణయంగా మారింది. సమన్యాయం, సామాజిక సమతుల్యత, పార్టీ కేడర్ విశ్వాసం - ఇతర అన్ని అంశాలను కలిపి చూస్తే గుండ సంతోష్ ఎంపిక పార్టీకి దీర్ఘకాలంలో లాభం చేకూర్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తోంది.
Admin
Kalam Power News