కలం పవర్ న్యూస్ - సోషియల్ మీడియా వైరల్ / మహబూబ్ నగర్ : మహబూబ్‌నగర్, ఏప్రిల్ 20 ( కలం పవర్ న్యూస్ బ్యూరో) మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని అత్యంత రద్దీ ప్రదేశమైన క్లాక్‌టవర్ కూడలి వద్ద నేడు భారీ కంటైనర్ వాహనం ప్రవేశించడంతో ట్రాఫిక్ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. గంటల తరబడి వాహనాలు కదలకపోవడంతో ఉద్యోగులు, విద్యార్థులు, అత్యవసర పనులపై వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టణంలో పగటి పూట, ముఖ్యంగా సాయంత్రం సమయంలో భారీ వాహనాల ప్రవేశంపై నిషేధం ఉన్నప్పటికీ, ఆ నియమాలు కాగితాలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత భారీ వాహనం పట్టణ హృదయంలోకి ఎలా ప్రవేశించింది.? పోలీస్ శాఖ నిఘా ఎక్కడ విఫలమవుతోంది.? అనే ప్రశ్నలు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్ వంటి ప్రధాన కూడలిలో ట్రాఫిక్ నియంత్రణలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు సమయానికి స్పందించకపోవడం, ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల పరిస్థితి మరింత విషమించిందని వాహనదారులు మండిపడుతున్నారు. “నియమాలు ఉన్నాయే గానీ అమలు లేదు… పోలీసులు ఉన్నారే గానీ కనిపించడం లేదు” అంటూ స్థానికులు వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకీ తీవ్రమవుతున్న నేపథ్యంలో, ఇప్పటికైనా పోలీస్ శాఖ మేల్కొని కఠిన చర్యలు తీసుకోవాలని, భారీ వాహనాలపై కట్టడి విధించాలని, ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. “ట్రాఫిక్ జామ్ కాదు… వ్యవస్థ జామ్ అయింది!” అంటూ ఈ ఘటనపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. *సోషల్ మీడియా స్పందనతో కదిలిన యంత్రాంగం – క్లాక్‌టవర్ ట్రాఫిక్ క్లియర్!* -*తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు* మహబూబ్‌నగర్ పట్టణంలోని క్లాక్‌టవర్ కూడలిలో ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్‌పై జిల్లా పోలీస్ యంత్రాంగం తక్షణమే స్పందించి ట్రాఫిక్‌ను సక్రమంగా క్లియర్ చేయడం పట్ల పట్టణ ప్రజలు సోషల్ మీడియాలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సమస్యను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలు లేవనెత్తిన వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ట్రాఫిక్ సిబ్బందిని క్షేత్రస్థాయికి పంపడం విశేషం. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి రహదారిని అడ్డుకున్న భారీ కంటైనర్ వాహనాన్ని తరలించి ట్రాఫిక్‌ను సజావుగా నడిపించారు. ఈ వేగవంతమైన చర్యలతో గంటల తరబడి ఇబ్బందులు పడుతున్న వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. “ప్రజా సమస్యలపై ఇలాగే వెంటనే స్పందిస్తే మరిన్ని సమస్యలు తీరుతాయి” అంటూ స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం చూపిన పోలీస్ శాఖకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ, ఇదే స్పందన భవిష్యత్తులో కూడా కొనసాగాలని కోరుతున్నారు.
Admin
Kalam Power News