కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్‌నగర్, మార్చి 6 ( కలం పవర్ న్యూస్ బ్యూరో ) : రోజురోజుకు విస్తరిస్తున్న మహమ్మారి ఎయిడ్స్ పై విద్యార్థుల ద్వారా సమాజంలో అవగాహన పెంచే ఉద్దేశంతో ప్రభుత్వ డైట్ కాలేజ్ మెట్టుగడ్డలో పోస్టర్ మేళా ప్రజెంటేషన్ పోటీలు నిర్వహించారు. విద్యాశాఖ మరియు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని 84 పాఠశాలల నుంచి ఎంపికైన విద్యార్థులు పాల్గొన్నారు. ఎయిడ్స్ వ్యాప్తి, నివారణ చర్యలు, ప్రజల్లో చైతన్యం కల్పించే అంశాలపై విద్యార్థులు రూపొందించిన పోస్టర్లను ప్రజెంట్ చేస్తూ తమ ప్రతిభను ప్రదర్శించారు. విద్యార్థుల సృజనాత్మకతతో రూపొందించిన పోస్టర్లు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి జిల్లా డీఈఓ ప్రవీణ్ కుమార్, SCERT SRG మధుసూదన్ రెడ్డి, అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ రాజు, డైట్ కాలేజ్ ప్రిన్సిపల్ మినాజుద్దీన్, ఏఏంఓ దుంకుడు శ్రీనివాస్, సీఎంఓ సుధాకర్ రెడ్డి, డీఎస్ఓ షంషీర్ తదితరులు హాజరయ్యారు. అలాగే వివిధ పాఠశాలల జీవశాస్త్ర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పోటీల్లో ఉత్తమ ప్రదర్శన చేసిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. మొదటి బహుమతి కల్పన (కేజీబీవీ హన్వాడ), రెండవ బహుమతి నందిని (జడ్పిహెచ్ఎస్ ఏదిరా), మూడవ బహుమతి బద్రీనాథ్ (జడ్పిహెచ్ఎస్ బాలుర మహమ్మదాబాద్) సాధించారు. వారి పోస్టర్ ప్రజెంటేషన్లు న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నాయి. విద్యార్థులలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే కాకుండా, వారు సమాజానికి అవగాహన దూతలుగా మారాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు.
Admin
Kalam Power News