కలం పవర్ న్యూస్ - క్రైమ్ / మహబూబ్ నగర్ : మహబూబ్‌నగర్, మార్చి 16 ( కలం పవర్ న్యూస్ బ్యూరో ) మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్ మండలంలో అక్రమ ఇసుక దందా మళ్లీ మొదలైంది. స్థానికంగా సాండ్ మాఫియా అరాచకాలు రోజురోజుకు పెరుగుతుండగా, ఈ వ్యవహారంలో భూత్పూర్ పోలీసుల పాత్రపై కూడా తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల అండదండలతోనే ఇసుక మాఫియా బహిరంగంగా దోపిడీకి పాల్పడుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పాతమొల్గర గ్రామ పరిధిలో ఉన్న వాగుల నుంచి పట్టపగలే భారీగా ఇసుకను తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ ఇసుక రవాణాపై దేవరకద్ర ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి గ్రామస్థులు సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మారలేదని చెబుతున్నారు. :: ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తున్నారా..?:: అక్రమ ఇసుక రవాణాపై వచ్చిన ఫిర్యాదులను భూత్పూర్ ఎస్సై చంద్రశేఖర్ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చినప్పటికీ, ఫిర్యాదులను పట్టించుకోకుండా బుట్టదాఖలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా 100 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన వారి వివరాలను ముందుగానే మాఫియాకు చేరవేస్తున్నారనే ఆరోపణలు కూడా గ్రామస్థులు చేస్తున్నారు. దీంతో ఫిర్యాదు చేసిన వారిపై మాఫియా గ్యాంగ్ బెదిరింపులకు దిగుతోందని వారు చెబుతున్నారు. :: పాతాళానికి చేరుతున్న భూగర్భ జలాలు :: పాతమొల్గర, కప్పేట ప్రాంతాల్లో భారీగా ఇసుక తవ్వకాల కారణంగా వాగులు ఖాళీ అవుతున్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు క్రమంగా తగ్గిపోతుండటంతో చుట్టుపక్కల వ్యవసాయ బావులు, బోర్లు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి ఆధారమైన నేలలు కూడా ఇసుక మాఫియా దోపిడీకి బలవుతున్నాయని వారు చెబుతున్నారు. :: మాఫియా బెదిరింపులు :: అక్రమ ఇసుక రవాణాపై ఫిర్యాదు చేసిన వారిని మాఫియా బహిరంగంగానే బెదిరిస్తున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. స్థానిక పోలీసుల అండ ఉందనే ధీమాతో మాఫియా సభ్యులు మరింతగా రెచ్చిపోతున్నారని వారు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. :: ప్రజావాణిలో ఫిర్యాదు :: భూత్పూర్ మండల పరిధిలోని పాతమొల్గర గ్రామ శివారులో వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని కప్పేట మల్లేష్ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్న రైతులపై దాడులకు పాల్పడుతున్నారని కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు స్పందించి భూత్పూర్ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ ఇసుక దందాపై సమగ్ర విచారణ జరిపించి, మాఫియాకు అండగా నిలుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Admin
Kalam Power News