కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్‌నగర్, మార్చి 8 ( కలం పవర్ న్యూస్ బ్యూరో ) పాలమూరు జిల్లాలో ఉద్యోగాల పంట పండిస్తుందని ఆశించిన పరిశ్రమలు, స్థానిక నిరుద్యోగుల పాలిట ఇప్పుడు నిరాశగా మారుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దివిటిపల్లి సమీపంలోని అమరరాజా బ్యాటరీ పరిశ్రమలో "స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు" అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించకపోవడం జిల్లా ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ పరిశ్రమపై తీవ్ర విమర్శలు చేసిన నాయకులు, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అదే అంశంపై మౌనం పాటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. “కార్ఖానా” అంటూ గళమెత్తిన నోళ్లు ఇప్పుడు ఎందుకు మూగబోయాయన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. *వేతనాల్లో ప్రాంతీయ అసమానత.?* పరిశ్రమలో కీలకమైన మేనేజర్, సూపర్‌వైజర్, ఇంజనీర్ పోస్టుల్లో ఎక్కువగా ఆంధ్రా ప్రాంతానికి చెందినవారే ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారికి సుమారు రూ.30 వేల వరకు జీతాలు ఇస్తుండగా, స్థానిక యువతను ప్రధానంగా ప్రొడక్షన్ విభాగంలో తక్కువ వేతనాలతో పనిచేయిస్తున్నారని కార్మికులు అంటున్నారు. కొంతమంది స్థానికులకు రూ.16 వేల వరకు మాత్రమే వేతనం లభిస్తోందని వారు వాపోతున్నారు. స్థానిక రైతులు భూములు ఇచ్చి పరిశ్రమ రావడానికి సహకరించినప్పటికీ, ఉద్యోగాల్లో మాత్రం వారికి తగిన ప్రాధాన్యం దక్కడం లేదని బాధితులు చెబుతున్నారు. తమ సొంత నేలపై తాము తక్కువ వేతనాలతో పనిచేయాల్సిన పరిస్థితి వచ్చిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. *సిఫార్సు లేఖలకే విలువ లేదా.?* ఉద్యోగాల కోసం ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు తీసుకెళ్లిన నిరుద్యోగులకు కూడా సరైన స్పందన లభించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. కొందరు ఉద్యోగార్థుల మాటల్లో చెప్పాలంటే, “ఇలాంటి ఎమ్మెల్యేల లేఖలు లారీ నిండా ఉన్నాయి” అంటూ యాజమాన్యం వ్యంగ్యంగా సమాధానం ఇచ్చిందని వారు చెబుతున్నారు. ప్రజాప్రతినిధుల మాటకే విలువ లేని పరిస్థితి వస్తే సామాన్యులకు న్యాయం ఎలా జరుగుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. *కార్మికుల సమస్యలపై ‘సోయి’ ఎక్కడ..?* భూముల సేకరణ సమయంలో హడావిడి చేసిన అధికారులు, నాయకులు ఇప్పుడు కార్మికుల సమస్యలపై పెద్దగా స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. కనీస వేతన చట్టం అమలవుతుందా.? స్థానికులకు ఎంతమేరకు ఉద్యోగాలు ఇచ్చారు.? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు. స్థానిక యువతకు అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో పరిశ్రమలకు భూములు ఇచ్చిన రైతులు, ఇప్పుడు అదే పరిశ్రమలో జరుగుతున్న అన్యాయాలపై సమాధానం కోరుతున్నారు. పాలమూరు అభివృద్ధి పేరుతో వచ్చిన పరిశ్రమలు నిజంగా స్థానికులకు ప్రయోజనం కలిగిస్తున్నాయా.? లేక కార్పొరేట్‌లకే లాభమా.? అన్న ప్రశ్నలు జిల్లాలో వినిపిస్తున్నాయి. ఇకనైనా"సోయి వున్న నేతలు" జోక్యం చేసుకుని పాలమూరు కార్మికుల పట్ల అమర రాజ యాజమాన్యం చూపుతున్న వివక్షతకు పరిష్కారం చూపించాలని కోరుతున్నారు.
Admin
Kalam Power News