కలం పవర్ న్యూస్ - క్రైమ్ / మహబూబ్ నగర్ : మహబూబ్‌నగర్, ఏప్రిల్ 24 ( కలం పవర్ న్యూస్ బ్యూరో ) మహబూబ్‌నగర్ రూరల్ పోలీసుల చాకచక్యంతో దొంగతనం కేసు వేగంగా ఛేదించబడింది. క్రైమ్ నం.181/2026 కు సంబంధించిన ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ ఘటన ఈ నెల 4వ తేదీ అర్ధరాత్రి హౌసింగ్ బోర్డ్ కాలనీ, పిస్తా హౌస్ సమీపంలో చోటుచేసుకుంది. బాధితుడు శ్యామసుందర చారి నివాసంలోకి చొరబడిన నిందితులు బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో కిరణ్ పాటిల్ అలియాస్ బాక్సర్ (కర్ణాటక), మహమ్మద్ షేక్ (హైదరాబాద్)లను అదుపులోకి తీసుకోగా, మహమ్మద్ సోహైల్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుండి సుమారు రూ.1.40 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో బంగారు చైన్, బ్యాంగిల్, ఉంగరాలు, మాంగల్యం, వెండి గజ్జెలు, మొలతాడు, లక్ష్మీదేవి వెండి విగ్రహం ఉన్నాయి. అదనంగా దొంగతనాలకు ఉపయోగించే టూల్ కిట్, పిక్యాక్స్, చిసెల్స్, కట్టింగ్ ప్లయర్, స్క్రూడ్రైవర్, కత్తులు, రెండు మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ దరావత్ జానకి పర్యవేక్షణలో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. జడ్చర్ల బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. అరెస్ట్ చేసిన నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించగా, పరారీలో ఉన్న మూడో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ప్రజలు తమ ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గాంధీ నాయక్ సూచించారు.
Admin
Kalam Power News