కలం పవర్ న్యూస్ - సోషియల్ మీడియా వైరల్ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ మార్చి 09 ( కలం పవర్ న్యూస్ బ్యూరో ) “గడియారం గడుగుడుమంటే… రోడ్లు గుంతల గాథ!” నగర అభివృద్ధి మాటల్లోనేనా.. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, కార్పొరేషన్‌గా రూపాంతరం చెందినా, నగర రోడ్ల పరిస్థితి మాత్రం “పేరు పెద్దది – పని చిన్నది” అన్నట్టే కనిపిస్తోంది. పట్టణ నడిబొడ్డున ఉన్న గడియారం చౌరస్తా వద్ద రోడ్డు గుంతలతో నిండిపోయి వాహనదారుల్ని రోజూ పరీక్షిస్తున్నా, నగర పాలకులు మాత్రం “చూసీ చూడనట్టే” ఉన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గడియారం చౌరస్తా, పాత బస్టాండ్, అశోక్ టాకీస్, తెలంగాణ చౌరస్తా… ఇలా నగరంలోని కీలక మార్గాల్లో రోడ్లపై ఏర్పడ్డ పెద్ద పెద్ద గుంతలు చూస్తే “కళ్లకు గంతలు కట్టుకున్నారా?” అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. ఈ మార్గాల్లో రోజూ వందలాది వాహనాలు తిరుగుతుంటాయి. గుంతల మధ్య వాహనం నడపడం అంటే " ముండ్లపై నడిచినట్టే” అని వాహనదారులు వాపోతున్నారు. అయితే విచిత్రమేమిటంటే… ప్రజలు తమ దుస్థితిని తామే నిందించుకుంటున్నారు గానీ, అధికారులను లేదా ప్రజాప్రతినిధులను నిలదీయడం మాత్రం కనిపించడం లేదు. “నిద్రపోయినవాడిని లేపొచ్చు గానీ, నిద్రపోయినట్టు నటించేవాడిని లేపలేం” అన్న సామెత ఇక్కడ మన నాయకులకు సరిగ్గా సరిపోతుందని పలువురు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు, మహబూబ్‌నగర్ నియోజకవర్గాన్ని రూ.2000 కోట్లతో అభివృద్ధి చేస్తామని ఢంకా బజాయించి గొప్పలు చెప్పే నాయకులకు, నగర నడిబొడ్డున ఉన్న గుంతలు మాత్రం కనబడకపోవడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. “డేగకు మాంసమే కనిపిస్తుంది” అన్నట్టుగా, మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉన్న రూ.1200 కోట్ల అభివృద్ధి నిధులపై మాత్రం అందరి కన్ను పడుతోంది కానీ, రోడ్లపై ఉన్న గుంతలు మాత్రం ఎవరికీ కనిపించడం లేదని నగరవాసులు సెటైర్లు వేస్తున్నారు. గడియారం చౌరస్తాలో గడియారం మాత్రం ప్రతి నిమిషం గడుగుడుమంటూ సమయం చెప్పుతోంది. కానీ ఆ గడియారం కింద ఉన్న రోడ్డు పరిస్థితి మాత్రం “కాలం గడిచినా మారని కథ”గా మిగిలిపోయింది. “చెయ్యి ఉన్నవాడికి పని ఉండదు, పని ఉన్నవాడికి చెయ్యి ఉండదు” అన్నట్టు పరిస్థితి మారింది. ఇప్పటికైనా నగర పాలకులు మేల్కొని రోడ్లపై ఏర్పడ్డ గుంతలను వెంటనే పూడ్చి, వాహనదారులు పడుతున్న ఇబ్బందులకు ముగింపు పలకాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే… గడియారం చౌరస్తా పేరు త్వరలోనే “గుంతల చౌరస్తా”గా మారినా ఆశ్చర్యం లేదేమో!
Admin
Kalam Power News