కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : రాబోవు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధులను నిర్వర్తించనున్న రిటర్నింగ్ అధికారులకు రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన ట్రైనర్ లతో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గతంలో నిర్వహించిన ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటిస్తూ ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వహించాలని హితవు పలికారు. ఈ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా ప్రతి అధికారి పూర్తి నిబద్ధతతో పనిచేయాలని అన్నారు. ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి, వాటిని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు.ఎన్నికలు బ్యాలెట్ పత్రాల ద్వారా జరుగనున్న నేపథ్యంలో, నోటిఫికేషన్ జారీ నుండి నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు,పోలింగ్, కౌంటింగ్ వరకు ప్రతి దశలో రిటర్నింగ్ అధికారులు అత్యంత జాగ్రత్తగా, పూర్తిస్థాయిలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థికి పూర్తి అవకాశం కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. నోటిఫికేషన్ జారీ చేసిన తక్షణమే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావాలని, అభ్యర్థులు ఎన్ని నామినేషన్లు సమర్పించినా వాటిని పూర్తిగా పరిశీలించి, ఆమోదించినవి, తిరస్కరించినవి, తిరస్కరణకు గల కారణాలను స్పష్టంగా ప్రకటించాలని సూచించారు. అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడానికి అతడితో పాటు ప్రతిపాదకుడు, మరో వ్యక్తి కలిపి గరిష్టంగా ముగ్గురికి మాత్రమే రిటర్నింగ్ అధికారి గదిలో ప్రవేశం కల్పించాలన్నారు. అభ్యర్థులతో పాటు వారి ప్రతిపాదకులు స్థానికులేనని ఓటరు జాబితా ఆధారంగా నిర్ధారణ చేసుకోవాలని, ప్రతి అంశాన్ని అధికారికంగా పూర్తిగా పరిశీలించిన తరువాతే ఉపసంహరణకు అనుమతించాలని ఆదేశించారు. సమయపాలన కచ్చితంగా పాటించాలని, ఎన్నికలు పూర్తిగా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించి, పోలింగ్, కౌంటింగ్ సమయంలో సమస్యలు రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియను పూర్తి క్రమబద్ధంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు ప్రతి అధికారి పూర్తి నిబద్ధతతో పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మి నారాయణ, నర్సిగ్ రావు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగేంద్రం, రిటర్నింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News