కలం పవర్ న్యూస్ - తెలంగాణ / నాగర్ కర్నూల్ : కస్టమ్ మిల్లింగ్ రైస్ ను ఎఫ్స సీ ఐ కి సకాలంలో అందించకుండా పెండింగ్ పెట్టుకున్న రైస్ మిల్లర్‌లపైన పీడీ యాక్ట్ నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో కస్టమ్ మిల్లింగ్ రైస్/ సిఎమ్‌ఆర్ డెలివరీ ప్రక్రియ పై మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం సేకరించిన ధాన్యం తీసుకున్న రైస్ మిల్లర్లు సకాలంలో సీఎమ్మార్ అప్పగించడంలో తీవ్ర జాప్యం చేస్తున్న వారి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఆయా రైస్ మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం నిల్వలు విజిలెన్స్ అధికారులు తనిఖీ చేసి, నిల్వల్లో వ్యత్యాసం వచ్చిన మిల్లర్లపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో సిఎమ్‌ఆర్ పెండింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. కల్వకుర్తి శ్రీ లక్ష్మీ వెంకట నరసింహస్వామి పారాబైడ్ రైస్ మిల్ ఇప్పటివరకు ఒక ఏసీకే కూడా ఎఫ్ సి ఐ కి అందించకుండా 13 ఏసీకేలు పెండింగ్లో ఉండడంపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. సీతారామాంజనేయ ఇండస్ట్రీట్ గుడిపల్లి 162 ఏసీకేలు పెండింగ్ ఉండడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 50% పెండింగ్ ఒకే మిల్లులో ఉండడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. తనిఖీలు నిర్వహించి ధాన్యాన్ని పరిశీలించాలని కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలో పది రైస్ మిల్లుల వద్ద పెండింగ్లో ఉన్న 324 ఏసీకేలను ఎఫ్ సి ఐ కి అందించకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 2022-/23 యాసంగి, వానా కాలం సీజన్ కింద 92 వేల 897 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్సీఐకి అందించాల్సి ఉండగా 43064 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే ఎఫ్సీఐకి అందించారని, 49833 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇంకా అందించాల్సి ఉందని అందించకపోవడంతో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. రానున్న 15 రోజుల్లో 100% ఎఫ్సీఐకి సీఎంఆర్ బియ్యాన్ని అందిస్తామని కలెక్టర్ కు మిల్లర్లు హామీ ఇచ్చారు. ప్రభుత్వం గతంలోని డిసెంబర్ 30 వరకు డెడ్ లైన్ విధించిన విషయాన్ని కలెక్టర్ గుర్తు చేశారు. అధిక శాతం పెండింగ్లో ఉంచుకున్న మిల్లర్ల నుండి ఇతర మిల్లర్లకు వరి ధాన్యాన్ని బదలాయించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె సీతారామారావు, జిల్లా సివిల్ సప్లై అధికారి స్వామి కుమార్, డిఎం సివిల్ సప్లై బాల్ రాజ్, మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు జూలూరి రమేష్, అసోసియేషన్ కార్యదర్శి రవి కుమార్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News