కలం పవర్ న్యూస్ - తెలంగాణ / Hyderabad : నాగర్ కర్నూల్ జిల్లాలోని రైస్ మిల్లులు వారి రోజువారీ మిల్లింగ్ సామర్థ్యం మేరకు మిల్లింగ్ చేసి కేంద్ర ఆహార సంస్థకు ఇవ్వాల్సిన బియ్యాన్ని ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర ఇరిగేషన్, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంత కుమారి హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సివిల్ సప్లై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సి.యం.ఆర్ ధాన్యం సేకరణ, ఇటీవల నిర్వహించిన ప్రజా పాలన ద్వారా స్వీకరించిన అభయ హస్తం దరఖాస్తుల డిజిటలైజేషన్ ప్రక్రియ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ పాల్గొన్నారు. రైస్ మిల్లర్లు ధాన్యం తీసుకొని మిల్లింగ్ చేయకుండా ఎఫ్.సి.ఐ కి ఇవ్వాల్సిన ధాన్యం ఇవ్వకపోవడం వల్ల రాష్టానికి ఆర్థిక ఇబ్బందులూ వస్తున్నాయని, జనవరి 31 లోగా ఆయా జిల్లాల వారీగా ఇవ్వాల్సిన బియ్యాన్ని ఎఫ్.సి.ఐ కి అందించే విధంగా రోజువారీ కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. ఎక్కడైనా పి.డి.ఎస్. బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్నట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిల్లర్లు వారి సామర్థ్యం మేరకు మిల్లు ఆడించి యుద్ధప్రాతిపదికన ఎఫ్.సి.ఐ. సివిల్ సప్లై కు బియ్యం ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సివిల్ సప్లై అధికారులను ఆదేశిస్తూ రైస్ మిల్లులు తమ సామర్థ్యం మేరకు మిల్లింగ్ చేసి ఎరోజుకు ఆరోజు ఎఫ్.సి.ఐ . కి బియ్యం పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం చేసే మిల్లుల పై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజాపాలన ద్వారా సేకరించిన అభయ హస్తం దరఖాస్తులను డిజిటల్ లైజేశన్ చేసే ప్రక్రియ నాగర్ కర్నూల్ జిల్లాలో సజావుగా కొనసాగుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా అన్ని దరఖాస్తులు ఆన్లైన్ లో అప్లోడ్ చేసే ప్రక్రియ పూర్తి అవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుండి సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్, ఇతర కార్యదర్శులు పాల్గొనగా జిల్లా నుండి అదనపు కలెక్టర్ కే. సీతారామ రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి స్వామి కుమార్, డి.యం. బాలరాజ్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News