కలం పవర్ న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : ఇందిర పాడీ డైరీ ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని డ్వాక్రా గ్రూపులో ఉన్న మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తానని అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయడానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్రీకారం చుట్టారు. డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టి తొలిసారిగా మధిర నియోజకవర్గానికి వచ్చిన ఆయన సోమవారం డిఆర్డిఓ ఐకెపి అధికారులను మధిర క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని ఇందిరా డైరీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాలని దశ దిశ నిర్దేశం చేశారు. 2013- 14 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టును అమలు చేయాలని భావించిన ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇందిర డైరీ ఇండస్ట్రియల్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (మధిర విలేజ్ పేరిట) ఏర్పాటు చేసి పరిశ్రమ ఏర్పాటు కావలసిన భూమిని సైతం అలాట్మెంట్ చేయించారు. రాష్ట్ర పునర్విభజన జరిగిన తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పది సంవత్సరాల కాలంలో ఈ ప్రాజెక్టును కాగితాలకే పరిమితం చేసింది. ఈ ప్రాజెక్టు పట్ల సరైన అవగాహన లేకపోవడం, అమలు చేయాలన్న చిత్తశుద్ధి లోపించడం వల్ల పది సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా నిర్లక్ష్యానికి గురైంది. నియోజకవర్గ అభివృద్ధి పట్ల విజన్ ఉన్న నాయకుడు భట్టి విక్రమార్కమల్లు తిరిగి ఈ ప్రాజెక్టును మధిరలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించేందుకు కసరత్తు మొదలు పెట్టారు. ఇందిర డైరీ ఏర్పాటు కావడం వల్ల నియోజకవర్గంలోని డ్వాక్రా సంఘాల్లో ఉన్న 53 వేల మంది మహిళలు పాడి పారిశ్రామికవేత్తలుగా ఎదగనున్నారు. వీరికి పాల ఉత్పత్తిపై ఇచ్చే ఆదాయంతో పాటు డైరీకి వచ్చిన లాభాల్లో కూడా వాటాదారులుగా కల్పించి లాభాలను పంచుతారు. వీరితోపాటు వ్యవసాయంపై అవగాహన కలిగిన నిరుద్యోగ యువతకు కూడా ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా వందలాది మందికి ఉపాధి కలగనుంది. నిత్యం నాలుగు లక్షల లీటర్ల పాల ఉత్పత్తి చేసే పరిశ్రమగా ఇందిరా డైరీ ఏర్పాటుకు భారీ ప్రణాళికలను భట్టి విక్రమార్క రూపొందిస్తున్నారు. అమూల్ కంపెనీకి మించి ఇందిరా డైరీని పెద్ద పరిశ్రమగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఈ ప్రాజెక్టును మొదలు పెడుతున్నారు. *డి ఆర్ డి ఓ, ఐకేపీ అధికారులతో సమీక్షా* ఇందిర డైరీ ఏర్పాటు కోసం మధిర క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు జిల్లా డిఆర్డిఓ ఎం విద్య చందన, డిపిఎంలు శ్రీనివాస్, దర్గయ్య, ఐదు మండలాల ఏపీఎంలు, సీసీలు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఈ ప్రాజెక్టు అమలుకు దశ దిశ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ నియోజకవర్గంలో డ్వాక్రా గ్రూపులో ఉన్న 53 వేల మంది మహిళలను పాడి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం లక్ష్యంగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ఐకెపి శాఖ చాల విలువైనదని రోటీన్ పరిపాలన కోసం పెట్టిన శాఖ కాదని ఉపోద్ఘాతం చేశారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకొని ఆర్థిక స్వావలంబన పొందే విధంగా, స్వయం ఉపాధి రంగాల్లో రాణించే విధంగా ఐకెపి అధికారులు పనిచేయాల్సి ఉంటుందన్నారు. పిల్లల భవిష్యత్తుకు కావలసిన ఆర్థిక వనరులను మహిళలు కల్పిస్తే రాష్ట్ర భవిష్యత్తు జరుగుతుందన్నారు. సంపద సృష్టించాలి అన్న ఆలోచనతో పని విధానం ఉండాలని అధికారులకు నిర్దేశించారు. నియోజకవర్గంలో ఇందిరా డైరీ ఏర్పాటుకు 2013-14 సంవత్సరంలో శ్రీకారం చుట్టినప్పటికీ రాష్ట్ర పునర్విభజన వల్ల పెండింగ్ పడిందన్నారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిందని వివరించారు. డ్వాక్రా గ్రూపు లో ఉన్న మహిళలకు పాడీ గేదెలు ఇప్పించి వారి నుంచి పాల సేకరణ ఇందిర డైరీ చేస్తుందన్నారు. సేకరించిన పాలను మార్కెట్ చేయడంతో పాటు మిగిలిన పాలతో తయారు చేసే ప్రతి ప్రోడక్ట్ ను ఉత్పత్తి చేస్తారని చెప్పారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అమూల్ కంపెనీకి మించి ఇందిరా డైరీ ఉంటుందన్నారు. ఇందిరా డైరీలో ఉండే సభ్యులకు పాల ఉత్పత్తితో వచ్చే ఆదాయంతో పాటు పరిశ్రమలో వచ్చే లాభాల్లో వాటాదారులుగా చేర్చుతామన్నారు అదేవిధంగా వ్యవసాయం పైన అవగాహన, ఆధారపడి ఉన్న నిరుద్యోగులకు సైతం ఈ పరిశ్రమలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని కల్పిస్తామని వివరించారు. పాడి ఉత్పత్తి కోసం పశువులకు కావలసిన పచ్చి గడ్డి, ఎండు గడ్డి, దాణా ను మహిళా రైతులకు ఇంటింటికి వెళ్లి సరఫరా చేయడానికి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. ఒక్కో మండలాన్ని నాలుగు బ్లాకులుగా విభజన చేసి నిరుద్యోగ యువతకు రుణాలు ఇచ్చి వాహనాలు, గడ్డి కటింగ్ మిషన్స్, దాణా మిక్సింగ్ మిషిన్లు సమకూర్చుతామన్నారు. అదే విధంగా పాడి పశువుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు ప్రతి మండలంలో వెటర్నరీ అంబులెన్స్ ఏర్పాటు చేయడంతో పాటు డాక్టర్లను ఏర్పాటు చేసి క్రమం తప్పకుండా పాడీ గేదెలకు వ్యాక్సినేషన్ తో పాటు వైద్య పరీక్షలు చేయిస్తామన్నారు. పాడి గేదెలు జబ్బు పడ్డప్పుడు రైతులు ఫోన్ చేస్తే 108 తరహాలోనే వెటర్నరీ అంబులెన్సులో వాటి వద్దకు వెళ్లి వైద్యం అందించే విధంగా ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశామని చెప్పారు. ఈ ప్రాజెక్టు పర్యవేక్షణకు డిఆర్డిఓ నుంచి ప్రత్యేక అధికారిని నియామకం చేసి పురోగతి స్థితిగతులపై ప్రతివారం సమీక్ష చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టు అమలు లక్ష్యాల కనుగుణంగా అధికారులు చిత్తశుద్ధితో మనస్పూర్తిగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ ప్రాజెక్టును తొలుత పైలెట్ ప్రాజెక్టుగా మధిరలో ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పారు.
Admin
Kalam Power News